
కర్నూలు, 06 మే (హి.స.)
గుంతకల్లు-వాడి వయా ఆదోని, మంత్రాలయం రైల్వే మార్గం అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రయాణికులు, సరుకులు (గూడ్స్) రవాణాకు వేరువేరు మార్గాలు (నాలుగు లైన్లు) ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం డబ్లింగ్ రైలు మార్గం ఉంది. డబ్లింగ్ లైన్లను క్వాడ్రాప్లింగ్ (నాలుగు లైన్లు)గా చేయడానికి రైల్వే శాఖ ప్రతిపాదనలు పంపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రూ.4,758 కోట్లు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలో చిప్పగిరి మండలం నంచర్ల నుంచి మంత్రాలయం మండలం తుంగభద్ర (మంత్రాలయం రోడ్) స్టేషన్ వరకు దాదాపు 95 కిలోమీటర్లు ఈ రైల్వేలైను ఉంది. నంచర్ల, నేమకల్లు, మొలగవల్లి, ఆస్పరి, నగనూరు, ఆదోని, ఇస్వీ, కుప్పగల్లు, కోసిగి, ఐరంగల్, మంత్రాలయం రోడ్డు (తుంగభద్ర) రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం వల్ల డబుల్ లైన్.. నాలుగు లైన్లుగా మారబోతోంది. ముంబై-చెన్నై వయా ఆదోని, గుంతకల్లు మధ్య ట్రాఫిక్ రద్దీ తగ్గించి ప్రయాణం వేగవంతం కానుంది. ఇటీవలే ఈ ప్రాజెక్టు డీపీఆర్ను దక్షిణ మధ్య రైల్వే శాఖ గుంతకల్లు డివిజన్ ఇంజనీర్లు కేంద్ర రైల్వే శాఖకు పంపించారు. పరిశీలించిన కేంద్రం నిధులు విడుదల చేయడంతో.. సీమ జిల్లాలు, కర్ణాటక మధ్య రైల్వే కనెక్టివిటీ బలోపేతం కానుంది.
గుంతకల్లు- వాడీ వయా జంక్షన్ల మధ్య 230 కిలోమీటర్లు డబ్లింగ్ రైల్వే మార్గం ఉంది. ప్రయాణికుల రైళ్లతో పాటు సరుకు రవాణా రైళ్ల రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కోసం, రైళ్ల క్రాసింగ్ కోసం మధ్యలో రైళ్లను ఆపేయాల్సి వస్తుంది. దీంతో సకాలంలో సరుకు రవాణా జరగడం లేదు. రాయలసీమ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాలకు ఐరన్, సిమెంటు, గ్రానైట్, బాక్సైట్ ఖనిజాలను రవాణా చేస్తుంది. అదే క్రమంలో చెన్నై, ముంబై మధ్య సరుకు రవాణా మెరుగుపరచడం ద్వారా లాభాలను అర్జించాలని రైల్వేశాఖ భావిస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV