
షాద్నగర్, 01 జూన్ (హి.స.)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్
నియోజకవర్గం కొత్తూరు మండలంలోని సిద్దాపూర్ గ్రామ శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న చెత్త డంప్ యార్డు ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలన్న డిమాండ్తో సిద్దాపూర్ గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించ తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ షాద్ నగర్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీగా పాదయాత్రతో బయలుదేరారు. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..... బిఆర్ఎస్ హయాం లో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందాలు నడిపిస్తున్నదని ఆరోపించారు.
ఏ భూముల్లో ఏ పరిశ్రమలు నెలకొల్పాలో ఏ భూముల్లో చెత్త డంప్ యార్డులు తీసుకురావాలో సీఎం రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిద్దాపూర్ ప్రాంతంలో ఐటీ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం సేకరించిన 350 ఎకరాల భూమిలో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెత్త డంప్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ చెత్త డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల లోని గ్రామాలకు ప్రజలకు పశువులకు అనేక సమస్యలు తలెత్తుతాయని, పర్యావరణ కాలుష్యంతో పాటు పరిసరాలు దెబ్బతింటాయన్నారు. వెంటనే డంప్ యార్డ్ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..