
అమరావతి, 10 జూన్ (హి.స.)
వినుకొండ రూరల్: రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు - గుంటూరు జాతీయ రహదారిపై నీలగంగవరం జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గద్వాల్ జిల్లా యర్రవల్లి మండలం ఆర్. గార్లపాడు గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ దర్శనాలకు వెళ్లారు. దర్శనానంతరం తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. మార్గంమధ్యలో నీలగంగవరం జంక్షన్ వద్ద ఎదురుగా వస్తున్న కారు.. వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. దీంతో ఆ కారు 300 మీటర్లు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మకు తగిలింది. ఈ ప్రమాదంలో కురవ జమ్మన్న, హుస్సేన్ తీవ్రంగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ