
సంగారెడ్డి, 24 జూన్ (హి.స.) భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్-2026 కార్యక్రమం జూన్ 25 నుంచి ప్రారంభం కానుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రతీక్ జైన్ తెలిపారు. ఓటరు జాబితాను ఖచ్చితంగా, పారదర్శకంగా రూపొందించేందుకు ఈ సవరణ చేపడుతున్నామన్నారు. ఓటరు జాబితా ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని, ప్రతి అర్హత కలిగిన ఓటరు భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే చేసి ఓటర్ల వివరాలు ధృవీకరిస్తారని చెప్పారు. ఆ తర్వాత జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. జాబితాలో తప్పులు ఉంటే జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబర్ 28 వరకు వాటిని పరిష్కరిస్తామన్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయ్యాక అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నామని కలెక్టర్ వివరించారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువత తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఇదే సరైన అవకాశమని సూచించారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని కలెక్టర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..