
కర్నూలు, 29 జూన్ (హి.స.)తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, తెలంగాణలో నాగర్కర్నూలు, రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, రైతులు ఉరుములు, ఈదురుగాలుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఎల్ నీనో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతము నుండి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, పిడుగులతో ఈదురుగాలుల హెచ్చరిక చేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.
కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
మంగళవారం (30-06-2026) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV