
జోగులాంబ గద్వాల, 29 జూన్ (హి.స.)
ప్రజావాణి ఆర్జీలను పరిష్కరించకుండా అలసత్వం చూపితే కఠిన చర్యలు తీసుకుంటామని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ వారం మొత్తం 29 ఫిర్యాదులను ప్రజల నుంచి స్వీకరించడం జరిగిందన్నారు. మండల స్థాయిలోనూ వచ్చిన ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజావాణి పోర్టల్ లో ప్రజల నుంచి వచ్చిన ఆర్జీల వివరాలను అప్లోడ్ చేస్తుండడంతో రాష్ట్రస్థాయిలోనూ ఉన్నతాధికారులు వీటిని పర్యవేక్షిస్తుంటారని పేర్కొన్నారు. వివిధ శాఖల్లో పెద్ద ఎత్తున ఆర్జీలు పెండింగ్ లో ఉంచడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బుధవారం వివిధ శాఖల అధికారులు తమ సిబ్బందితో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వచ్చే సోమవారంలోగా పెండింగ్ లో ఉన్న ఆర్జీలను పరిష్కరించాలని, అలసత్వం చూపే అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు ప్రజావాణి పోర్టల్ లో లాగిన్ అయి తమకు సంబంధించిన ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు.
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్ ఫరాల పంపిణి ప్రక్రియ బూత్ లెవెల్ అధికారుల పని తీరును మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలన్నారు. విద్యాలయాలు, వసతిగృహాలను సంబంధిత అధికారులు తరచు సందర్శిస్తూ, అక్కడి కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాలను కూడా పర్యవేక్షించాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..