దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కిషన్ రెడ్డి చాలెంజ్!
దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కిషన్ రెడ్డి చాలెంజ్!
Kishan Reddy


హనుమకొండ, 29 జూన్ (హి.స.)

తెలంగాణకు, వరంగల్కు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఇదే వరంగల్ గడ్డమీద చర్చకు నేను సిద్ధం అని ఎవరు ఎంత అభివృద్ధి చేశారో లెక్కలు తేలుద్దాం దమ్ముంటే చర్చకు రావాలని కాంగ్రెస్, బీఆర్ఎస్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చాలెంజ్ చేశారు. ఇవాళ హనుమకొండలో నిర్వహించిన బీజేపీ సభలో మాట్లాడిన ఆయన.. తాను ఇవాళ నేరుగా ఢిల్లీ నుంచి వచ్చానని మీకులా అబద్ధపు చాలెంజ్లతో కాకుండా పక్కా లెక్కలతో వచ్చానన్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని వరంగల్ నగరాభివృద్ధికి రూ.17 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. వరంగల్కు రాదనుకున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ఏడాది వరంగల్ ఎయిర్ పోర్టు పనులు ప్రారంభమవుతాయని, దేశంలో 7 మెగా టెక్స్ టైల్ పార్కులు ఇస్తే అందులో ఒకటి వరంగల్కు మంజూరు చేశామన్నారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చిన ఘనత బీజేపీది అన్నారు. వరంగల్లో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకున్నా అభివృద్ధి చేశామన్నారు. సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీ పనులు ఈ సంవత్సరం ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్కు అధికారం ఇస్తే తెలంగాణను నిలువునా ముంచారని ఈసారి బీజేపీకే ఓటు వేస్తామని తెలంగాణ ప్రజానీకం అంటోందని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయ సిబ్బంది కూడా తనను కలిసినప్పుడు చెబుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులతో దగా చేశారని మండిపడ్డారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతందని దీనికి వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు నాంది కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande