
సోమల(అన్నమయ్య), 07 జూన్ (హి.స.): కవర్లు కట్టిన కాయలకే మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఆ దిశగా ఉత్సాహం చూపుతున్నారు. మండలంలో 12 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు. ఇందులో సుమారు 4 వేల ఎకరాల్లో రైతులు ప్రభుత్వం అందజేసిన కవర్లను మామిడి కాయలకు కట్టారు. ప్రస్తుతం కోతల ప్రక్రియ చేపడుతున్నారు. మార్కెట్లో బేనిషా కిలో రూ.22 నుంచి రూ.25 లోపు పలుకుతోంది. కవర్లు కట్టిన కాయలకు రూ.45 వరకు పలుకుతోంది. కవరు లేని కాయలు తోతాపురి రూ.25, మల్లికా కాయలను రూ.22 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.
కవరు కట్టిన మల్లికా రూ.42 పలుకుతోంది. రైతులకు గిట్టుబాటు అవుతోంది. కవర్లు లేని కాయలకు తక్కువ ధర లభిస్తోంది. కవర్లు కట్టిన కాయల కొనుగోలుకు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. కవర్లు కడితే కాయల నాణ్యత దెబ్బతినదు. పైగా గిట్టుబాటు ధర వస్తుండటంతో రైతులు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో కొన్ని రకాలకు మాత్రమే కవర్లు కట్టేవారు. ప్రస్తుతం తోతాపురి రకానికి కూడా కవర్లు కడుతున్నారు.
పిందె దశలో నుంచి కాయదశకు చేరుకోవడంతో బంక, మంగు, మచ్చ వస్తోంది. వీటిని పోగొట్టడానికి మూడు సార్లు మందులు పిచికారీ చేశాం. రాయితీ కవర్లు కట్టడంతో కాయలకు కాయలు రాపిడి లేకుండా ఉంటుంది. దెబ్బతినకుండా ఉంటుంది. నాణ్యత, మంచి రంగు వస్తుంది. ఇటువంటి కాయలకు మార్కెట్లో మామూలు కాయల ధరల కంటే రెండు రెట్లు అధిక ధర వస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV