
అమరావతి, 10 జూలై (హి.స.)
ఇటీవల నగరంలో ఈ-సిగరెట్ల వాడకం పెరిగింది. పొగ రాదు. ఆన్లైన్లో విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. చూసేందుకు స్టైల్గా ఉంటోంది. తాగినా బయటవారికి తెలియదనే ఉద్దేశంతో యువత వినియోగిస్తున్నారు. విక్రయాలు చాపకింద నీరులా సాగిపోతున్నాయి. అందులో పొగాకు ఉండదు కనుక ఆరోగ్యానికి హానికరం కాదనే అపోహ కూడా యువతలో ఉంది. కానీ ఈ-సిగరెట్లు పొగాకు ఉత్పత్తుల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. పొగాకు ఉత్పత్తుల నుంచి సేకరించిన ద్రవాన్నే ఈ-సిగరెట్లలో ముడి సరకుగా వాడుతారు. రుచి, సువాసన కోసం వాడే ప్రొఫైలిన్ గ్లైకాల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ల వంటి రసాయనాలు ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయని వైద్యులు చెబుతున్నారు. అవి విడుదల చేసే పొగలో 2.5 పీఎం కంటే చిన్న రేణువులు ఉంటాయి. అవి ఊపిరితిత్తుల్లోకి చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. విద్యార్థులు జ్ఞాపకశక్తితో పాటు అభ్యసన సామర్థ్యాలు కోల్పోతారు.
ఇటీవల యువత ఈ-సిగరెట్ల వైపు ఆకర్షితులవుతున్నారు. వాసన రాదని విద్యార్థులు వినియోగిస్తున్నారు. అవి తాగితే ఊపిరితిత్తులు, గుండె, మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలవాటు వదల్లేకపోతే వైద్యులను సంప్రదించి థెరపీ తీసుకోవడం ఉత్తమం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ