ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు మేలు.. మంత్రి పొన్నం ప్రభాకర్
ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు మేలు.. మంత్రి పొన్నం ప్రభాకర్
Minister


సిద్దిపేట, 10 జూలై (హి.స.)

భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ మార్పులను తట్టుకుని, స్థిరమైన ఆదాయం సాధించేందుకు రైతాంగం సాంప్రదాయ పంటల నుంచి ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో నిర్వహించిన మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రులు ముఖ్య అతిథులుగా పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తమ 8 ఎకరాల పొలంలో ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చిన స్థానిక రైతు సంపత్ను మంత్రులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం 14 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని తెలిపారు. మున్ముందు 'ఎల్ నినో' ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చే ముప్పు ఉన్నందున రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు.

ఆయిల్ పామ్కు నీటి అవసరం చాలా తక్కువని, కోతుల బెడద ఉండదని.. తోట వేసిన నాలుగేళ్ల వరకు అంతర పంటలు సాగు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ. 50 వేల సబ్సిడీతో పాటు రైతు భరోసా కూడా అందిస్తుందని వివరించారు. సాగును ప్రోత్సహించేందుకు చిన్న గ్రామాల్లో 100 ఎకరాలు దాటిస్తే రూ.5 లక్షలు, పెద్ద గ్రామాల్లో 200 ఎకరాల పైన సాగు పెంచితే రూ. 10 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.

ఇంచార్జీ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం వల్ల వంటనూనెల దిగుమతులు కష్టతరమై ధరలు పెరుగుతున్నాయని, దేశీయంగా మనమే ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. నాలుగేళ్లు ఓపిక పడితే ఆయిల్ పామ్ ద్వారా రైతులు అద్భుతమైన లాభాలు గడించవచ్చు. వడ్ల కొనుగోళ్లు అదనంగా చేసినా ఎఫ్సీఐ తీసుకోవడం లేదు, గోదాములు నిండిపోయాయి. కాబట్టి ప్రత్యామ్నాయ పంటలే మేలు అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande