
హైదరాబాద్, 10 జూలై (హి.స.)
బీఆర్ఎస్, బీజేపీలపై తెలంగాణ పీసీసీ
అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా, పార్టీ అంతర్గత వ్యవహారాలపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావును టార్గెట్ చేస్తూ పీసీసీ చీఫ్ ఘాటు విమర్శలు గుప్పించారు. హరీష్ రావు గారు.. పదేళ్లు మంత్రిగా ఉండి మీరు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ మూడు నెలల టైమ్ ఎందుకు ఇవ్వాలి? మీరు కట్టిన ప్రాజెక్టులు కుంగిపోయాయి. దానికి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధిని చూసి హరీష్ రావుకు మిట్ట మధ్యాహ్నమే చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో హరీష్ రావు మా పార్టీలోకి వస్తానని చెబితే, మా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (PAC)లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం” అంటూ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ నిధులపై స్పందిస్తూ.. కవిత చేసిన ఆరోపణల్లో నిజం ఉందన్నారు. ఒక రీజినల్ పార్టీకి రూ.1,400 కోట్లు ఎలా జమ అయ్యాయో చెప్పాలని, దీనిపై ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయని అన్నారు.
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై కూడా మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో నీళ్ల దోపిడీ జరిగినప్పుడు, ప్రజల సొత్తు దుర్వినియోగం అయినప్పుడు ఈటల బీఆర్ఎస్ (ఆనాటి టీఆర్ఎస్)లోనే ఉన్నారని, ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారని గుర్తుచేశారు. ఆనాడు జరిగిన తప్పిదాలను ప్రశ్నించకుండా మౌనంగా ఉన్న ఈటల.. ఇప్పుడు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ 12 ఏండ్ల బీజేపీ పాలనను ప్రజలు చూశారని, వారి గురించి తేలిసి ప్రజలు మళ్లీ గోతిలో పడరని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలపై స్పందిస్తూ పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, అవన్నీ త్వరలోనే తొలగిపోతాయని స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ అనేది అందరికీ సమానమేనని తేల్చిచెప్పారు. కడియం శ్రీహరి, కొండ సురేఖ, తుంగతుర్తి పంచాయతీ వ్యవహారాలపై ఇద్దరు సీనియర్ నాయకులను (సచిన్ సావంత్, జగ్గారెడ్డి) అబ్జర్వర్లుగా నియమించామని వెల్లడించారు. వారిద్దరూ క్షేత్రస్థాయి నుంచి విచారణ జరిపి పార్టీకి నివేదిక ఇస్తారని, ఆ తర్వాతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..