వైసీపీ నేతలు వికృత శైలిని ఎంచుకున్నారు.. వాళ్ల ట్రాప్లో పడొద్దు: కేబినెట్ సమావేశంలో చంద్రబాబు
వైసీపీ నేతలు వికృత శైలిని ఎంచుకున్నారు.. వాళ్ల ట్రాప్లో పడొద్దు: కేబినెట్ సమావేశంలో చంద్రబాబు
chandra babu


అమరావతి, 10 జూలై (హి.స.)

ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశంలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న అసత్య ప్రచారాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. డిజిటల్ వేదికల్లో ప్రభుత్వంపై, కూటమి నేతలపై వస్తున్న అభ్యంతరకర వీడియోలు, పోస్టులపై సమావేశంలో మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే.. హద్దులు మీరి అసత్యాలు వక్రీకరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. సోషల్ మీడియా సైబర్ నేరాల నియంత్రణకు వెంటనే ఒక ప్రత్యేక 'టాస్క్ ఫోర్స్' ఏర్పాటు చేయాలని, అవసరమైతే నిపుణులను బయటి నుంచి తీసుకోవాలని సూచించింది. అంతేకాకుండా, ఈ కేసులలో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కొత్తగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకోవాలని స్పష్టం చేసింది. ఈ కార్యాచరణపై ఇప్పటికే ఉన్న కేబినెట్ సబ్ కమిటీలోనూ చర్చించనున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ నేతలు ఈ సరికొత్త వికృత ప్రచార శైలిని ఎంచుకున్నారని ఈ సందర్భంగా చంద్రబాబు మంత్రులకు వివరించారు. వారు కావాలనే ఎమ్మెల్యేలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ట్రాప్‌లో పడొద్దు. సంయమనం పాటించండి అని సూచించారు.

అనంతపురం సహా పలు జిల్లాల్లో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. ప్రతికూల ప్రచారాలను తిప్పికొడుతూ... ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదేనన్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లే ఇన్‌ఛార్జ్ మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలతో పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకోవాలని, రెవెన్యూతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande