హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్
హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. తీవ్రంగా ఖండించిన భారత్
Harmooj


న్యూఢిల్లీ, 12 జూలై (హి.స.)

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజీకి చేరాయి. ఒమన్ తీరంలోని వ్యూహాత్మక హర్మూజ్ జలసంధిలో సైప్రస్ పతాకంతో ప్రయాణిస్తున్న 'జీఎఫ్ఎస్ గెలాక్సీ' అనే వాణిజ్య నౌకపై ఇరాన్ దాడికి తెగబడింది. ఈ ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. వారిలో 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఒక భారతీయ పౌరుడు మాత్రం గల్లంతయ్యారని సమాచారం.

అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. ఇరాన్ జరిపిన ఈ దాడితో నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతిని, ఒక్కసారిగా భీకర మంటలు చెలరేగాయి. దీంతో ప్రాణాలు రక్షించుకునేందుకు సిబ్బంది నౌకను వదిలి పరుగులు తీశారు. సదరు నౌక అనుమతి లేని 'అనధికారిక మార్గంలో ప్రయాణించడం వల్లే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ఇరాన్ సమర్థించుకుంది. అంతేకాకుండా, కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దాడి తీవ్రత దృష్ట్యా ఈ నౌక ఇకపై ప్రయాణించే స్థితిలో లేదని అధికారులు ధృవీకరించారు.

ఈ దాడిని భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళనకరమని పేర్కొంది. 'ప్రాంతీయ శాంతి భద్రతల దృష్ట్యా ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించాలి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంతర్జాతీయ జలమార్గాల్లో పౌర నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలి' అని భారత్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం గల్లంతైన భారతీయ పౌరుడి కోసం ఒమన్ అధికారులతో కలిసి భారత రాయబార కార్యాలయం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande