
హైదరాబాద్, 12 జూలై (హి.స.)
భారత సాంస్కృతిక వారసత్వానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులోని పురాతన దేవాలయాల నుంచి విదేశాలకు అక్రమంగా తరలించబడిన మూడు అత్యంత విలువైన పురాతన విగ్రహాలను తిరిగి భారతదేశానికి అప్పగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు పురాతన విగ్రహాలను ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి తీసుకొచ్చేందుకు స్మగ్లింగ్ నిరోధక విభాగం చేపట్టిన చర్యలు ఫలించాయి. విగ్రహాలు తమిళనాడులోని ఆలయాలకు చెందినవని, వీటిని అక్రమంగా దేశం దాటించారని ఐడల్ వింగ్ అధికారులు ఆధారాలను సమర్పించారు. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం వీటిని వెనక్కి ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఈ సాంస్కృతిక సంపదను తిరిగి తీసుకురావడానికి తమిళనాడు 'ఐడల్ వింగ్-సీఐడీ' ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది. ఇటీవల ప్రధాని మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో జరిపిన విస్తృత చర్చల అనంతరం ఈ విగ్రహాల అప్పగింతకు మార్గం సుగమమైంది.
తమిళనాడు ఐడల్ వింగ్-సీఐడీ అధికారుల ప్రకారం, కాన్‌బెర్రాలోని 'నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా' ఈ మూడు విగ్రహాలను అధికారికంగా అప్పగించునుంది. ఇండియాకు వస్తున్న విగ్రహాల్లో తిరువారూర్ జిల్లా కడువంకుడి గ్రామంలోని 'అరుల్మిగు కైలాసనాథర్ ఆలయానికి' చెందిన 'త్రిశూల మంగళ కాళి' విగ్రహం ఒకటి. ఇది 46 సెం.మీ ఎత్తు, 29 సెం.మీ వెడల్పు కలిగిన కాంస్య విగ్రహం. దీని విలువ సుమారు 1,90,000 యూరోలు (అంటే దాదాపు రూ. 2 కోట్లు) ఉంటుందని అంచనా. మరొకటి రాతి నంది విగ్రహం. ఇది 80.5 సెం.మీ ఎత్తు, 110.5 సెం.మీ వెడల్పు ఉంటుంది. దీని విలువ సుమారు 4,50,000 అమెరికన్ డాలర్లు (దాదాపు రూ. 4 కోట్లు) ఉంటుందని అంచనా.
ఇక, మూడోది తంజావూరు జిల్లా కుంభకోణం తాలూకాలోని మానంబాడి గ్రామంలో ఉన్న 'అరుల్మిగు నాగనాథస్వామి ఆలయానికి' చెందిన ఆరు ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం. ఈ విగ్రహం 130 సెం.మీ ఎత్తు, 110 సెం.మీ వెడల్పు కలిగి ఉంటుంది. దీని విలువ సుమారు 1,80,000 యూరోలు (దాదాపు రూ. 2 కోట్లు) ఉంటుందని అంచనా.
అయితే, ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో ఉన్న నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో తమిళనాడులోని ఆలయాల్లో చోరీకి గురైన పురాతన విగ్రహాలు ఉన్నట్లు రాష్ట్ర విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి చెందిన పోలీసులకి సమాచారం అందింది. దీంతో ఆయా విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు 2016లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi