అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో భారత్ ప్రభంజనం; 5 స్వర్ణ పతకాలతో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానం కైవసం
అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో భారత్ ప్రభంజనం; 5 స్వర్ణ పతకాలతో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానం కైవసం
image


న్యూఢిల్లీ, 13 జూలై (హి.స.)

కొలంబియాలోని బుకారామంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ (IPhO) 2026లో భారత విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ పోటీల్లో పాల్గొన్న భారత జట్టులోని ఐదుగురు సభ్యులూ బంగారు పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించి దేశ కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేశారు. ఈ అసాధారణ విజయంతో భారత్ పతకాల పట్టికలో చైనా, కజకిస్తాన్, రష్యా, సౌత్ కొరియా మరియు తైవాన్‌ దేశాలతో కలిసి ఉమ్మడిగా ప్రపంచంలోనే నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 87 దేశాల నుండి 381 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

భారత్ తరఫున స్వర్ణ పతకాలు గెలిచిన విజేతల్లో పుణె (మహారాష్ట్ర)కు చెందిన కనిష్క్ జైన్, ఇండోర్ (మధ్యప్రదేశ్)కు చెందిన రిద్ధేష్ అనంత్ బెండాలే, ద్వారక (న్యూఢిల్లీ)కు చెందిన రిషిత్ గార్గ్, ముంబై (మహారాష్ట్ర)కు చెందిన శ్రేష్ఠ్ సురైయా మరియు అహ్మదాబాద్ (గుజరాత్)కు చెందిన స్వరిత్ జోషి ఉన్నారు. గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్‌కు హాజరవుతున్న ప్రతి ఒక్క భారతీయ విద్యార్థి పతకం సాధిస్తూ వస్తుండగా, ఈసారి అందరూ గోల్డ్ మెడల్స్ సాధించి ఆ రికార్డును మరింత సుస్థిరం చేశారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) పరిధిలోని హోమీ భాభా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (HBCSE), డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) సంయుక్తంగా ఈ ఒలింపియాడ్ ప్రోగ్రామ్‌ను సమన్వయం చేశాయి.

భారత యువ శాస్త్రవేత్తల ప్రతిభపై అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రటరీ అజిత్ కుమార్ మొహంతీ హర్షం వ్యక్తం చేస్తూ.. ఈ అద్భుత విజయం దేశానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఐదు బంగారు పతకాలతో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకోవడం మన విద్యార్థుల అంకితభావానికి, శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జట్టు నాయకులు అన్వేష్ ముజుందార్ (HBCSE-TIFR), లీనా జోషి (సెంట్ జేవియర్స్ కాలేజీ, ముంబై)లతో పాటు సైంటిఫిక్ అబ్జర్వర్లు ఆనంద దాస్‌గుప్తా (IISER కోల్‌కతా), నిషా కేల్కర్ (రత్నగిరి)లకు మరియు విద్యార్థులను తీర్చిదిద్దిన మెంటార్ల బృందానికి అటామిక్ ఎనర్జీ విభాగం ప్రత్యేక అభినందనలు తెలియజేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande