
కడప, 17 జూలై (హి.స.)ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కడప జిల్లా 8, గుంటూరులో 3, విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదైనా, ఒకేచోట గుంపుగా బయటపడలేదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వచ్చిన వారంతా హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ కేసుల్లో నలుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. వారంతా కరోనాతోపాటు.. పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన బాధితుల్లో ముగ్గురు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండగా, ఇతరులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో కొవిడ్ కలకలం ఇటు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో కొవిడ్ కలకలం రేగింది. నిన్న కరోనా లక్షణాలతో వచ్చిన ఒక వ్యక్తికి వైద్యులు చికిత్స అందించి హోం ఐసోలేషన్కు పంపించారు. ఎయిమ్స్లో ప్రత్యేక ఫీవర్ వార్డును ఏర్పాటు చేశారు. మరోవైపు జ్వరం కేసుల దృష్ట్యా జిజిహెచ్ వైద్యులు కూడా అప్రమత్తమయ్యారు. ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే 250 RTPCR కిట్లను సిద్ధం చేసి… అనుమానితులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
5 శాంపుల్స్ను పుణె ల్యాప్కు పంపిన అధికారులు
కరోనా కేసుల నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ప్రస్తుతానికి కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు.
కేసులు ఎక్కువగా వస్తుండటంతో ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అధికారులను అప్రమత్తం చేసింది. ముందులు, టెస్టులు అందుబాటులో ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. కరోనా కేసులపై నేడు మధ్యాహ్నం తరవాత సమీక్ష నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV