
న్యూఢిల్లీ, 02 జూలై (హి.స.)
గల్ఫ్ ఆఫ్ ఆడెన్ సముద్ర తీరంలో భారత నౌకాదళం మరోసారి తన ప్రతాపాన్ని చాటింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ వాణిజ్య నౌకపై జరిగిన సముద్రపు దొంగల దాడి ప్రయత్నాన్ని భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికంద్ విజయవంతంగా తిప్పికొట్టింది. అయితే, భారత్కు చెందిన అత్యంత కీలకమైన సరుకుతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని సముద్రపు దొంగలు దాడికి తెగబడ్డారు. ఈ నౌకలో ఓ భారతీయ సిబ్బంది కూడా ఉన్నారు. పైరేట్లు నౌకపైకి వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై, నౌకలోని ఒక సురక్షిత గదిలో దూరి లోపలి నుంచి లాక్ చేసుకున్నారు. అనంతరం కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా తమకు ఎదురైన ప్రమాదం గురించి భారత నౌకాదళానికి సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన మార్కోస్ కమాండోలు..
కాగా, సమాచారం అందుకున్న వెంటనే వెంటనే గల్ఫ్ ఆఫ్ ఆడెన్లో గస్తీ కాస్తున్న భారత యుద్ధనౌక 'INS త్రికంద్' మెరుపు వేగంతో సదరు వాణిజ్య నౌక వైపు దూసుకెళ్లింది. భారత నావికాదళ యుద్ధనౌక తమ వైపు రావడం చూసిన సముద్రపు దొంగలు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఇండియన్ నేవీకి చెందిన స్పెషల్ ఫోర్సెస్ మార్కోస్ (MARCOS -Marine Commandos) రంగంలోకి దిగి, ఎమ్బీ గోల్డెన్ ఆర్సెనల్ నౌకలోకి ప్రవేశించి సిబ్బందిని కాపాడినట్లుగా ధృవీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు