ఇస్రోకు బాంబు బెదిరింపు మెయిల్.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
ఇస్రోకు బాంబు బెదిరింపు మెయిల్.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
isro


బెంగళూరు, 02 జూలై (హి.స.)భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. బెంగళూరు లోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి గురువారం ఈ బెదిరింపు ఈ-మెయిల్ వ‌చ్చిన‌ట్లు ఇస్రో సిబ్బంది తెలిపారు. దాంతో అప్రమత్తమైన ఇస్రో (ISRO) సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. బాంబు స్క్వాడ్‌తో హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకున్న పోలీసులు ఇస్రో ప్రాంగణంలో సిబ్బందిని ఖాళీ చేయించి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఇది నకిలీ బాంబు బెదిరింపు అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ-మెయిల్‌ ఎవరు పంపారు..? ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలావుండగా ఢిల్లీ పోలీసులు నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. యూపీలోని ఘ‌జియాబాద్‌కు చెందిన అతడు.. ఎన్‌ఐఏ, డీఆర్‌డీఓ, కేంద్ర పౌర విమానయాన శాఖ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలకు బెదిరింపు మెయిల్స్ పంపించినట్లు పోలీసులు వెల్లడించారు.

సాంకేతికత సాయంతో నిందితుడిని గుర్తించి కస్టడీలోకి తీసుకున్నారు. అతడు కొన్నేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నివాసంలో ఎలాంటి పేలుడు పదార్థాలుగానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande