
హైదరాబాద్, 20 జూలై (హి.స.)
నగరంలోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మైనర్ బాలికలు ఒకేసారి అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిన ఈ బాలికల కోసం కుటుంబ సభ్యులు ఆందోళనతో గాలిస్తున్నారు.అసలేం జరిగిందంటే?
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. దోమలగూడకు చెందిన ముగ్గురు బాలికలు సోమవారం ఉదయం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికారు. ఫలితం లేకపోవడంతో వెంటనే స్థానిక దోమలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.హిమాయత్‌నగర్‌లో ఆటో ఎక్కినట్లు గుర్తింపు:
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో సదరు ముగ్గురు బాలికలు దోమలగూడ నుంచి నడుచుకుంటూ వెళ్లి, హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై ఒక ఆటో ఎక్కినట్లు పోలీసులు గుర్తించారు.పోలీసుల ముమ్మర గాలింపు:
బాలికలు ఎక్కిన ఆటో నంబర్ ఆధారంగా అది ఎటువైపు వెళ్లిందనే కోణంలో పోలీసులు నిఘా పెట్టారు. వారు ఏదైనా ప్రాంతానికి వెళ్లారా లేక ఎవరైనా ప్రలోభపెట్టి తీసుకెళ్లారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు. బాలికల ఫోన్ లోకేషన్లు, స్నేహితుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. త్వరలోనే బాలికలను సురక్షితంగా కనిపెడతామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.-----
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi