
కర్నూలు, 27 జూలై (హి.స.) నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల పాటు వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు వెల్లడించిన సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆకాశం నిలకడగా మేఘావృతమై ఉండటంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు ఉధృతమయ్యే అవకాశముంది. గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో, గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఊరటనిచ్చి, ఉష్ణోగ్రతలను.
ఆంధ్రప్రదేశ్లో చెదరుమదరు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో రానున్న డెబ్బై రెండు గంటల వ్యవధిలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా కాకుండా చెదరుమదరుగా జల్లులు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే రాయలసీమ ప్రాంతంలో తీవ్రస్థాయిలో పిడుగులు పడే ముప్పు ఉందని అధికారులు ప్రత్యేకంగా హెచ్చరించారు. వర్షం కురిసే సమయంలో గొర్రెల కాపరులు, రైతులు, సామాన్య ప్రజలు ఆరుబయట లేదా చెట్ల కింద నిలబడకుండా సురక్షితమైన భవనాల కిందకు వెళ్లాలని సూచించారు. కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
తెలంగాణ, హైదరాబాద్లో మేఘావృతమైన ఆకాశం
తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడవచ్చు. ప్రయాణ సమయాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున వాహనదారులు, ప్రయాణికులు రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
రైతులకు వాతావరణ శాఖ కీలక సూచనలు
రానున్న రోజుల్లో వర్షపాతం తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ, వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. రైతులు తమ విత్తనాలు చల్లే పనులు, ఎరువుల పిచికారీ, పురుగుమందుల స్పేరింగ్ విషయంలో స్థానిక వాతావరణ నివేదికలు, హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV