
విజయనగరం, 27 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఆగస్టు 1న జరగనున్న ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రధాని రాక సందర్భంగా ఏపీ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ సన్నాహకాలు చేస్తోంది.ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ ప్రకారం, ఆగస్టు 1న ఉదయం 10.45 గంటలకు ఆయన నేరుగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం నూతన టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన పలు విశేష సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకిస్తారు. ఎయిర్పోర్టును అధికారికంగా ప్రారంభించిన తర్వాత అక్కడే నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మధ్యాహ్నం 1.05 గంటలకు ప్రధాని మోదీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV