
హైదరాబాద్, 29 జూలై (హి.స.)బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్కు ఢిల్లీలో అసలేం పనుందని ప్రశ్నించిన ఆయన.. కేంద్ర మంత్రులను కలుస్తున్నాననే పేరుతో బీజేపీతో రాయబారం నడుపుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కోసమే ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో తెలంగాణ అంశాల పేరుతో కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు కేటీఆర్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్ పార్టీ మనుగడ కోసమే ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారని వెంకట్ అన్నారు. కేసీఆర్ కోసం ఫామ్హౌస్లో డమ్మీ అసెంబ్లీ పెట్టే పరిస్థితి వస్తుందేమోనని ఎద్దేవా చేశారు. ఉదయం కేంద్ర మంత్రులను కలుస్తున్నానని చెప్పే కేటీఆర్.. రాత్రివేళ ఎవరిని కలుస్తున్నారో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఇప్పుడు ముగిసిన అధ్యాయమని, ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలనే ఆ పార్టీ కొనసాగిస్తోందని విమర్శించారు. కేసీఆర్ నుంచే పచ్చి అబద్ధాలు చెప్పే రాజకీయ సంస్కృతి బీఆర్ఎస్కు వచ్చిందని ఆరోపించారు.
హైడ్రాను కోర్టు తప్పుపట్టలేదు..
హైడ్రాపై చేస్తున్న విమర్శలను కూడా బల్మూరి వెంకట్ ఖండించారు. బఫర్ జోన్లో భూములు ఉంటే ఫిర్యాదు చేయాల్సిందేనని, హైడ్రాను కోర్టు తప్పుపట్టలేదని, కేవలం కమిషనర్ కోర్టుకు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిందని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటికే వేల ఎకరాల ప్రభుత్వ భూములను, వేల కోట్ల విలువైన ఆస్తులను కాపాడిందని తెలిపారు. ఢిల్లీలో జరిగిన కీలక పరిణామాలపై కేటీఆర్ స్పందించకుండా సంగ్రామ సభల పేరుతో అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యేలకు గత ప్రభుత్వంలో భద్రత కల్పించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ అవసరమైన భద్రత కల్పిస్తోందని, పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటుచేశారని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్