నేడు శ్రీశైలానికి కృష్ణమ్మ!జూరాల విద్యుత్కేంద్రం నుంచి 30 వేల క్యూసెక్కులు విడుదల
కృష్ణమ్మ శ్రీశైలం వైపు అడుగులు వేస్తోంది. జూరాల ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలోని ఆలమట్ట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.
శ్రీశై


కర్నూలు, 29 జూలై (హి.స.) : కృష్ణమ్మ శ్రీశైలం వైపు అడుగులు వేస్తోంది. జూరాల ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలోని ఆలమట్ట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలా కళకళలాడుతున్నాయి. దిగువన జూరాలకు నీరు విడుదలవుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి మంగళవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో విద్యుత్కేంద్రం ద్వారా 30 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఆ ప్రవాహం బుధవారానికి శ్రీశైలానికి చేరనుంది. ఆలస్యంగానైనా వరద ప్రారంభం కావడం, అటు తుంగభద్ర జలాశయానికీ వరద కొనసాగుతుండడంతో రాయలసీమ రైతుల్లో సాగు ఆశలు చిగురిస్తున్నాయి.

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆలమట్టి డ్యాంకు పెద్దఎత్తున వరద వస్తోంది. మంగళవారం ఉదయం 73,333 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. డ్యాం 95.777 శాతం నిండింది. సాయంత్రం 6 గంటలకు 80 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ఠ నీటి మట్టం 1704.81 అడుగులు, సామర్థ్యం 123.081 టీఎంసీలు కాగా.. 1703.85 అడుగుల వద్ద 119.065 టీఎంసీల వరద చేరింది. మరో నాలుగు టీఎంసీలు వస్తే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుంది.

నారాయణపూర్ జలాశయానికి 35 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం గరిష్ఠ నిల్వ సామర్థ్యం 33.313 టీఎంసీలకు గాను ప్రస్తుతం 32.37 టీఎంసీల నిల్వ ఉంది. ఆలమట్టి నుంచి భారీగా వరద వస్తుండడంతో 84,300 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. ఇదంతా జూరాలకే రానుంది.

జూరాల డ్యాంకు ప్రస్తుతం 18 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ నుంచి ఇన్ఫ్లో భారీగా పెరగడంతో నేడు జూరాల గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. డ్యాం గరిష్ఠ సామర్థ్యం 9.657 టీఎంసీలకు 8.611 టీఎంసీల నిల్వ ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande