
అమరావతి, 09 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనాలు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్న ప్రధానాంశాలు, అజెండా వివరాల్లో ముఖ్యంగా.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రాజధాని కోసం కొత్తగా భూములిచ్చే వారికి ఎకరానికి ఏడాదికి రూ.40 వేల చొప్పున యాన్యుటీ ఇచ్చేందుకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలుస్తూ నెలకు రూ.10 వేల చొప్పున అద్దె భత్యం మంజూరు చేయనున్నారు.
కొత్త పూలింగ్ గ్రామాల పరిధిలోని రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేసే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా పలు ప్రభుత్వ, ఆధ్యాత్మిక, పారిశ్రామిక సంస్థలకు భూముల కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ