రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం.. డిప్యూటీ సీఎం
రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం.. డిప్యూటీ సీఎం
భట్టి


ఖమ్మం, 09 జూలై (హి.స.)

రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగునీరు, వ్యవసాయం, ధాన్యం కొనుగోలు, మార్క్ ఫెడ్ కార్యకలాపాలు, వ్యవసాయ యాంత్రీకరణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి మెగా రైతు మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందే తప్ప మాటల్లో కాదని స్పష్టం చేశారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వారి ఆదాయం పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఉందన్నారు. రైతాంగ అవసరాలను, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ప్రభుత్వం రైతుల అవసరాల తీర్చేందుకు అన్ని విధాల కృషి చేస్తోందని అన్నారు.

రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ధాన్యం కోనుగోళ్ళు కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని చెప్పారు. రైతుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత ప్రతిపక్ష పార్టీలకు లేదని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం రైతులకు ఏమి చేసిందో లెక్కలతో సహా సమాధానాలు చెప్పటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ఒక్కటే. ఈ రాష్ట్ర సంపదంతా పోగేసి ఆ ప్రాజెక్టు కట్టారు.. అది ఇప్పుడు ఎలా ఉందో మీకు అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. దశాబ్దాల కిందట కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు నేటికీ చెక్కుచెదరకుండా రైతులకు నీళ్లు అందిస్తున్నాయని ఆయన చెప్పారు. మాయ మాటలు చెప్పేటువంటి పార్టీలకు.. కాంగ్రెస్ పార్టీ చేతల పనులకు వ్యత్యాసం నేడు ప్రజలందరికీ తెలుసు అని ఆయన అన్నారు. పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన మన జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు కొత్తగా తీసుకొచ్చే ప్రాజెక్టులు ఇతర అంశాలను కూలంకషంగా వివరించేందుకే రైతు ఆశీర్వాద సభను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతు భరోసా కింద కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల అకౌంట్లో నేరుగా వేసినటువంటి చరిత్ర మన ప్రజా ప్రభుత్వంది అని అన్నారు. ఎన్ని సమస్యలున్నా ప్రజా ప్రభుత్వం ఇక్కడ పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మొక్కజొన్న, జొన్నలను కొనుగోలు చేసింది ఈ ప్రభుత్వం అన్నారు. ఫార్మ్ మెకనైజేషన్ కోసం ప్రజా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. సత్తుపల్లి నుంచి మొదలుపెడితే ఆదిలాబాద్ వరకి పామాయిల్ ప్లాంటేషన్ని విరివిగా ప్రోత్సహించామని ఆయన తెలిపారు. మా రైతులు బాగుండాలి. ఆ రైతు వ్యవసాయం బాగుండాలని మా ప్రభుత్వం ఇప్పుడు కోరుకుంటుందని ఆయన అన్నారు. రైతే ఈ దేశానికి వెన్నుముక.. అటువంటి వెన్నుముకను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. అందులో భాగంగానే మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలనే మధిర శాసనసభ నియోజకవర్గంలో ఈ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సభకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు క్యాబినెట్లో ఉన్నటువంటి అందరి మంత్రులని ఈ సభకి ఆహ్వానించినట్లు భట్టి విక్రమార్క చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande