
విజయనగరం/భోగాపురం, 01 ఆగస్టు (హి.స.)
:ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో భారీ వ్యయంతో నిర్మించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ గా అధికారిక నామకరణం చేశారు. ఈ భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గతంలో ప్రాజెక్టులకు కేవలం ఒకే కుటుంబం పేర్లు పెట్టే సంస్కృతి ఉండేదని విమర్శించారు. తమ ప్రభుత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావుల పేర్లను పెట్టి నిజమైన గౌరవాన్ని ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయబోయే ఒక గొప్ప మైలురాయి అని ఆయన అభివర్ణించారు. దీనివల్ల ఔషధ, సమాచార సాంకేతిక, పర్యాటక రంగాలు వేగంగా అభివృద్ధి చెంది, వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు.కేవలం ఎయిర్‌పోర్ట్ మాత్రమే కాకుండా, ఏపీ అభివృద్ధి కోసం వేల కోట్ల విలువైన ప్రథమ సెమీకండక్టర్ ప్లాంట్, జాతీయ రహదారులు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని ప్రధాని వెల్లడించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కలిసి డబుల్ ఇంజన్ వేగంతో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు.ఈ విమానాశ్రయాన్ని మొదటి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణించే సామర్థ్యంతో నిర్మించారు. భవిష్యత్తులో దీనిని 4 కోట్ల సామర్థ్యానికి విస్తరించనున్నారు. ఈ నెలాఖరులోనే ఇక్కడి నుంచి అధికారికంగా వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవంతో అటు విజయనగరం, ఇటు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi