
భోగాపురం, 01 ఆగస్టు (హి.స.) ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో మైలురాయి ఆవిష్కృతం కానుంది. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.4,727 కోట్ల వ్యయంతో దేశంలోనే అత్యాధునిక హంగులతో నిర్మితమైన 'అల్లూరి సీతారామరాజు (భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయం' ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రత్యేక విమానంలో నేరుగా ఇక్కడికి చేరుకోనున్నారు. ప్రధాని రానున్న ఫ్లైట్ ల్యాండింగ్ కు సువిశాల రన్ వే ముస్తాబయింది. మోడీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని రాక సందర్భంగా సుమారు 7,000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17 అర్ధరాత్రి 00.01 నుంచి ఇక్కడికి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
ప్రధానికి అపూర్వ స్వాగతం.. ఉత్తరాంధ్ర ప్రజల కలల సౌధం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు వస్తున్న ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం పలికేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. దాదాపు 13 వేల మందికి పైగా బాలికలు ముమ్మరంగా థింసా సాధన చేయడం విశేషం.
అంతర్జాతీయ ఎయిర్పోర్టులకు మించి..
విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అదే స్థాయి ప్రమాణాలతో భోగాపురం ఎయిర్ పోర్టును సిద్ధం చేసింది. విమాన ప్రయాణ కేంద్రంగానే కాకుండా.. పరిశ్రమలు, ఉపాధి, ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు కేంద్రబిందువుగా మారేలా అల్లూరి సీతారామ రాజు ఎయిర్ పోర్టుకు రూపకల్పన చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భోగాపురం ఒకటి. నిర్మాణం ప్రారంభమైన కేవలం 31 నెలల్లోనే పనులు పూర్తి చేయడమే కాకుండా, మొదట నిర్ణయించిన గడువుకంటే దాదాపు ఐదు నెలల ముందే సిద్ధం చేశారు. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థికాభివృద్ధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు, ఎగుమతులకు, లాజిస్టిక్స్కు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక వసతిగా మారనుంది.
రూ.4,727 కోట్లతో నిర్మాణం.. జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీవీఐఏఎల్) ద్వారా పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. మొత్తం 2,703.26 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమగ్ర ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. విమానాశ్రయానికి 2,203 ఎకరాలు, ఏవియేషన్ హబ్కు 500 ఎకరాలు, ఏవియేషన్ యూనివర్సిటీ/ఎడ్యుసిటీకి 136 ఎకరాలు కేటాయించారు. విమానాశ్రయ పరిధిలో ఎయిర్సైడ్ డెవలప్మెంట్, సిటీ సైడ్ కమర్షియల్ డెవలప్మెంట్, రెసిడెన్షియల్ డెవలప్మెంట్, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు. 3,800 మీటర్ల పొడవైన రన్వే ఈ విమానాశ్రయానికి ప్రధాన ఆకర్షణ. వైడ్బాడీ విమానాల కార్యకలాపాలకు అనుకూలంగా దీనిని రూపొందించారు. అంటే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ ఏ330, ఎయిర్ బస్ ఏ340 వంటి భారీ ఎయిర్ క్రాఫ్టులు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించగలవు. ఇక ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్, నావిగేషన్ ఎయిడ్స్, సీఎన్ఎస్/ ఏటీఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు ఈ ఎయిర్ పోర్టులో అందుబాటులో ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రమాణాలతో ఎయిర్సైడ్ మౌలిక వసతులను అభివృద్ధి చేశారు.
భవిష్యత్లో 4 కోట్ల మంది ప్రయాణించేలా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాడ్యులర్ విధానంలో భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. తొలి దశలో ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్లో దశలవారీ విస్తరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరించేందుకు మాస్టర్ప్లాన్ రూపొందించారు. ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ టెర్మినల్, ఎయిర్సైడ్, కమర్షియల్ మౌలిక వసతులను విస్తరించేందుకు వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు.
ప్రయాణికుల సౌకర్యం, వేగవంతమైన ప్రాసెసింగ్, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచేందుకు కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జిలు, కామన్ యూజ్ పాసింజర్ ప్రాసెసింగ్ వ్యవస్థ, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, సెల్ఫ్ సర్వీస్ పాసింజర్ ప్రాసెసింగ్, స్మార్ట్ సర్వైవలెన్స్, యాక్సెస్ కంట్రోల్, సెక్యూర్టీ మేనేజ్మెంట్ సిస్టం, ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ వంటి ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.
25 వేల టన్నుల కార్గో సామర్థ్యం.. ఉత్తరాంధ్ర ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకంగా మారనుంది. ఇక్కడ ఏటా 25,000 టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్, అధిక విలువైన, పెరిషబుల్ ఉత్పత్తుల రవాణాకు అవసరమైన టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు వేగవంతం కానున్నాయి. భవిష్యత్లో విశాఖపట్నం పోర్టు, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్వర్క్లతో అనుసంధానం ద్వారా భోగాపురం తూర్పు తీరంలో కీలకమైన ఎయిర్ కార్గో, లాజిస్టిక్స్ హబ్గా ఎదగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV