
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
వీర్ సావర్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై నమోదైన క్రిమినల్ పరువునష్టం కేసును, అలాగే లక్నో కోర్టు జారీ చేసిన సమన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. వివరాల్లోకి వెళితే.. 2022లో మహారాష్ట్రలో జరిగిన ఒక మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, వీర్ సావర్కర్ బ్రిటీష్ వారికి సేవకుడిగా ఉండేవారని, అంతేకాకుండా వారి నుంచి పింఛను కూడా తీసుకున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు స్వాతంత్య్ర సమరయోధుడిని కించపరిచే విధంగా ఉన్నాయని, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశకు చెందిన ఓ న్యాయవాది కోర్టులో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా లక్నో కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేయగా, దానిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు నిర్ణయం..
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, చట్టప్రకారం ఈ కేసును విచారించడానికి అవసరమైన ప్రభుత్వ అనుమతి (Sanction) లేదని గుర్తించింది. ఈ సాంకేతిక కారణాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, రాహుల్ గాంధీపై ఉన్న కేసును, జారీ చేసిన సమన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత విచారణల సందర్భంగా, స్వాతంత్య్ర సమరయోధులపై బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. సావర్కర్ వంటి నేతలను మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవిస్తారని, అటువంటి వారిపై అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేయడం తగదని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఏది ఏమైనప్పటికీ, తాజాగా సాంకేతిక అంశాల ప్రాతిపదికన ఈ కేసు నుంచి రాహుల్కు ఉపశమనం లభించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు