
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న జనగణన
-2027 (Census 2027) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. ఈ జనాభా లెక్కల సేకరణలో పౌరుల నుంచి వివరాలు సేకరించడానికి ఉద్దేశించిన 40 ప్రశ్నల జాబితాను కేంద్ర హోంశాఖ అధికారికంగా నోటిఫై చేసింది. ఈసారి జనాభా లెక్కల ప్రక్రియ తొలి విడతను రాబోయే సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభించనున్నట్లుగా వెల్లడించింది.
ఈసారి రూపొందించిన 40 ప్రశ్నల ప్రశ్నాపత్రంలో కొన్ని నూతన, కీలకమైన అంశాలను పొందుపరిచారు. పౌరుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మరింత ఖచ్చితంగా అంచనా వేయడానికి కులం వివరాలతో పాటు, దేశంలో కోవిడ్ నిరోధక టీకాలు ఎంతమంది తీసుకున్నారనే సమాచారాన్ని కూడా సేకరించనున్నారు. వాటితో పాటు ఇంట్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, వినియోగిస్తున్న డిజిటల్ సాధనాలు అంటే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, సొంత వాహనాలు వంటి సాధారణ గృహ వివరాలు కూడా ఇందులో భాగం చేశారు.
అదేవిధంగా ఈసారి జనగణన ప్రక్రియను పూర్తి డిజిటల్ పద్ధతిలో చేపడుతున్నారు. ఎన్యూమరేటర్లు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన మొబైల్ యాప్ల ద్వారా నేరుగా సమాచారాన్ని నమోదు చేయనున్నారు. పౌరులు కూడా తమ వివరాలను సొంతంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే 'సెల్ఫ్-ఎన్యూమరేషన్' వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యే తొలి విడతలో ప్రధానంగా ఇళ్ల లెక్కింపు, నివాస వసతుల వివరాలు సేకరించనుండగా, ఆ తర్వాత రెండో విడతలో పూర్తిస్థాయి జనాభా గణనను చేపట్టనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు