
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోలాహలం అప్పుడే మొదలైంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలో ఉన్న ప్రతిష్టాత్మక సలాల్ డ్యామ్ (Salal Dam) జాతీయ జెండా త్రివర్ణ కాంతులతో మనోహరంగా ముస్తాబైంది. స్వాతంత్య్ర దినోత్సవ ముందస్తు వేడుకల్లో భాగంగా చెనాబ్ నదిపై నిర్మించిన ఈ జలవిద్యుత్ ప్రాజెక్టును కాషాయం, తెలుపు, పచ్చని రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చీకటి పడగానే విద్యుత్ కాంతులతో మిలమిల మెరిసిపోతున్న సలాల్ డ్యామ్ దృశ్యాలు స్థానికులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదేవిధంగా కాశ్మీర్ లోయలోని పలు చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ భవనాలను సైతం త్రివర్ణ పతాక రంగులలో అందంగా అలంకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..