
హైదరాబాద్, 14 ఆగస్టు (హి.స.)
దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో అసమాన ప్రతిభ, ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ విభాగాల సిబ్బందికి కేంద్ర హోంశాఖ సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,057 మంది అధికారులను ఈ పతకాల కోసం కేంద్ర హోం శాఖ ఎంపిక చేయగా వీరిలో 92 మంది రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు, 301 మందికి పోలీసు మెడల్ ఫర్ గ్యాలంట్రీ, 664 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలకు ఎంపిక అయ్యారు. గ్యాలంట్రీ పతకాలు సాధించిన 301 మందిలో అత్యధికంగా 197 మంది తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సాహసోపేత సేవలు అందించిన వారు ఉన్నారు. జమ్మూకశ్మీర్కు చెందిన 51 మందికి, ఈశాన్య రాష్ట్రాలలోని 12 మంది పోలీసులకు ఈ పతకాలు దక్కాయి.
తెలంగాణకు 15, ఏపీకి 21:
కాగా, ఈ ప్రతిష్టాత్మక పతకాలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 21, తెలంగాణ నుంచి 15 మంది ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఎంపికైన 15 మందిలో ముగ్గురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 10 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలు ప్రకటించారు. రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను అదనపు డిప్యూటీ కమిషనర్ జోగుల నర్సయ్య, ఎస్పీ ఆర్. జగదీశ్వర్ రెడ్డి అందుకోనుండగా గ్యాలంట్రీ మెడల్స్ ను జూనియర్ కమాండోలు బి. సత్యరావు, కె. సందీప్ కుమార్, జె. వంశీకృష్ణ అందుకోబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసులలో ఏడుగురు పోలీసులకు గ్యాలంట్రీ మెడల్స్, ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 11 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఏపీకి చెందిన ఐజీ గుడి విజయ్ కుమార్, ఐజీ బలంకారి వెంకట రామిరెడ్డి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు ఎంపిక కాగా.. గ్యాలంట్రీ మెడల్స్ కు హెడ్ కానిస్టేబుళ్లు కొర్లాన మహేశ్, పైడి శ్రీరామమూర్తి, అడారి హేమసుందర రావు, చింతపల్లి సత్యనారాయణ, రౌతు మహేశ్, ఆబోతుల అప్పలనాయుడు, రుతాల కన్నబాబు ఎంపికయ్యారు.
సీబీఐ అధికారులకు 21 పతకాలు:
కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)లో పనిచేస్తున్న 21 మంది అధికారులకు పతకాలు దక్కాయి. ఇందులో ఆరుగురికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 15 మందికి పోలీసు విశిష్ట సేవా పతకాలకు ఎంపికయ్యారు. విశాఖపట్నం డీఎస్పీ (సీబీఐ)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంజయ్ కుమార్ సమాల్కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం వరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు