
నిజామాబాద్, 15 ఆగస్టు (హి.స.)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన మీదట, పుర ప్రముఖులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతిని నివేదిస్తూ, ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, డెయిరీ, పశు సంవర్ధక, అటవీ, విద్యా, వైద్యారోగ్య, మహిళా శిశు సంక్షేమం, మిషన్ భగీరథ, నీటి పారుదల, సమగ్ర శిక్ష అభియాన్ తదితర శాఖల ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను సందర్శించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి, ఆర్టీసీ, విద్యుత్, పౌర సరఫరాలు, హౌసింగ్ తదితర శాఖల శకటాల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహూకరించారు. పతకాలు పొందిన పోలీసులకు మెడల్స్ బహూకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..