
అమరావతి, 16 ఆగస్టు (హి.స.)
మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాలపై ఉపాధ్యాయులు అత్మగౌరవ పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కర్నూలు, తిరుపతిల్లో ఆందోళనలు చేపట్టగా, ఆదివారం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇందులో దాదాపు 7వేల మంది మెగా డీఎస్సీ టీచర్లు పాల్గొంటారని భావిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి అంబేడ్కర్ స్మృతివనం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. తమ ఆత్మగౌరవాన్ని కాపాడాలని అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేయనున్నారు. తమపై ఆరోపణలు చేసేవారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకోనున్నారు. ఈ సందర్భంగా తమకు ఉద్యోగాలు ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి టీచర్లు తమ సంఘీభావాన్ని, మద్దతును తెలపనున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు మెగా డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులు అన్ని జిల్లాల నుంచి స్వచ్ఛందంగా బెజవాడ తరలివస్తున్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఎవరికి వారు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని రావాల్సిన లొకేషన్ పాయింట్ను షేర్ చేసుకుంటున్నారు. మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలతో తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు తమ ప్రతిభను కించపరిచేలా ఉన్నాయని మండిపడుతున్నారు. ఎంపికైన అభ్యర్థులపై తప్పుడు ప్రచారం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ