నాలుగున్నరేళ్లకే ఫీజు
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులు చెల్లించాల్సింది అంతే ‘టీఏఎఫ్ఆర్సీ’ స్పష్టమైన ఉత్తర్వులు 2021-26 మధ్య అదనంగా వసూలు చేసింది వెనక్కి ఇవ్వాలని ఆదేశం ఫలించిన విద్యార్థులు, తల్లిదండ్రుల పోరాటం.
MBBS fees


హైదరాబాద్, 15 ఆగస్టు (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరే విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాల కాలానికి మాత్రమే ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ సంస్థ(టీఏఎఫ్ఆర్సీ) శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు, మైనారిటీ, నాన్ మైనారిటీ వైద్య కళాశాలల జాబితాతో.. 2021-23 బ్లాక్ పీరియడ్తోపాటు, 2023-26 బ్లాక్ పీరియడ్ బ్యాచ్లకు సంబంధించి కళాశాలలు వసూలు చేయాల్సిన మొత్తం కోర్సు ఫీజు, వార్షిక ఫీజు, నాలుగో సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల కాలానికి తీసుకోవాల్సిన రుసుముల మొత్తాలను ఉత్తర్వుల్లో పొందుపరిచింది. పలు ప్రైవేటు వైద్య కళాశాలలు ఆయా బ్లాక్ పీరియడ్లలోని విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో అదనంగా తీసుకున్న సొమ్ము కూడా వెనక్కి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇప్పటివరకు అనేక ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ఐదేళ్ల కాలానికి రుసుములు వసూలు చేస్తున్నాయి. వాస్తవంగా ఆయా కోర్సులు నాలుగున్నర సంవత్సరాలకే పూర్తవుతాయి. అయినప్పటికీ కళాశాలలు ఆరు నెలల కాలానికి అదనంగా రుసుములు వసూలు చేస్తుండటంతో విద్యార్థులపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా ఒక్కో బీ-క్యాటగిరీ విద్యార్థిపై కనీసం రూ.6-7 లక్షలు, సీ-క్యాటగిరీ విద్యార్థిపై రూ.13-15 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కొంతకాలంగా ఈ సమస్యపై పోరాటం చేస్తున్నారు. హైకోర్టునూ ఆశ్రయించారు. వైద్య కళాశాలల ఫీజులను నిర్ణయించే ‘టీఏఎఫ్ఆర్సీ’నే ఈ సమస్యను పరిష్కరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో టీఏఎఫ్ఆర్సీ నాలుగున్నర సంవత్సరాలకే ఫీజులను తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా విద్యార్థులకు భారీ ఊరట కల్పించినట్లయింది.

వేల మందిపై తగ్గనున్న ఆర్థిక భారం

టీఏఎఫ్ఆర్సీ తాజా ఉత్తర్వులలో 2021-23 బ్లాక్ పీరియడ్లో ఓ ప్రైవేటు కళాశాలలో బీ-క్యాటగిరీ మొత్తం కోర్సు ట్యూషన్ ఫీజును రూ.56,25,000గా నిర్ణయించింది. ‘ఈ మొత్తాన్ని వాయిదాల్లో ఏడాదికి రూ.12,50,000 చొప్పున చెల్లించాలి. ఆ ప్రకారం చివరి సంవత్సరం ఆరు నెలల కాలానికి రూ.6,25,000 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 2023-26 బ్లాక్ పీరియడ్కు సంబంధించి ఇదే కళాశాలలో మొత్తం కోర్సు ఫీజు రూ.58,50,000 కాగా..ఏడాదికి రూ.13 లక్షల చొప్పున చెల్లించాలి. ఆ ప్రకారం చివరి సంవత్సరం ఆరు నెలలకు రూ.6.5 లక్షలు చెల్లిస్తే సరిపోతుంది. సీ-కేటగిరీకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది’ అని నిర్దేశించింది. ‘ఆరు నెలల కాలానికి అదనపు ఫీజులు వసూలు చేస్తుండటంతో వేల మంది వైద్య విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని, ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారిపై రూ.లక్షల్లో భారం తగ్గుతుందని’ పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్(పామ్స్) అధ్యక్షుడు మల్లోజు సత్యనారాయణచారి హర్షం వ్యక్తంచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande