తిరుమలలో భారీగా భక్తుల రద్దీ: సర్వదర్శనానికి 22 గంటల సమయం
వరుస సెలవులు కావడంతో కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. సర్వదర్శనానికి 22 గంటల సమయం.
తిరుమల


తిరుమల, 16 ఆగస్టు (హి.స.) వరుస సెలవులు కావడంతో కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోవడంతో, క్యూలైన్లు వెలుపలికి విస్తరించాయి. దీంతో ఎలాంటి టైమ్ స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం లభించడానికి సుమారు 22 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ విపరీతంగా ఉండటంతో క్యూలైన్లలో వేచి ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు నిరంతరం తాగునీరు, పాలు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉంటే నిన్న(శనివారం) ఒక్కరోజే రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని మొత్తం 90,293 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో 53,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.81 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ దృష్ట్యా వేచి ఉండే సమయం పెరిగే అవకాశం ఉన్నందున, వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే యాత్రికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande