చట్టాలను ఉల్లంఘిస్తే సేఫ్ హార్బర్ రక్షణ ఉండదు: మెటాకు కేంద్రం హెచ్చరిక
చట్టాలను ఉల్లంఘిస్తే సేఫ్ హార్బర్ రక్షణ ఉండదు: మెటాకు కేంద్రం హెచ్చరిక
Warning


హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)

భారతీయ చట్టాలను ఉల్లంఘిస్తే 'సేఫ్ హార్బర్' (రక్షణ కవచం) మినహాయింపులు పొందేందుకు వీలుండదని ప్రముఖ సాంకేతిక దిగ్గజం మెటా (Meta) సంస్థకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. కంటెంట్ మోడరేషన్, పిల్లలపై లైంగిక వేధింపుల మెటీరియల్ (CSAM) నియంత్రణపై కేంద్రం ఇటీవల మెటా ప్రతినిధులతో నిర్వహించిన చర్చల సందర్భంగా ఈ విషయాన్ని తేల్చిచెప్పింది. ప్రభుత్వ హెచ్చరికల అనంతరం మెటా ప్రతినిధులు జాగ్రత్తలు పాటిస్తూ, చట్టవిరుద్ధమైన కంటెంట్ను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాలను సెన్సార్ చేయడం లేదా భావప్రకటనా స్వేచ్ఛను అణచివేయడం తమ ఉద్దేశం కాదని, సామాజిక సమతుల్యతను దెబ్బతీసే అంశాలపై చట్ట పరిధిలోనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

అలాగే కంటెంట్ మోడరేషన్ సమయంలో భారత్లోని విభిన్న భాషలు, ప్రాంతీయ సంస్కృతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్రం సూచించింది. కేవలం గ్లోబల్ ప్రామాణికాలను మాత్రమే కాకుండా, స్థానిక భాషా సంస్కృతులను అర్థం చేసుకునే టీమ్స్ ను కూడా రంగంలోకి దించాలని పేర్కొంది. వీటితో పాటు సమాజంలో వేగంగా విస్తరిస్తున్న డీప్ఫేక్ లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Al) ద్వారా సృష్టించిన కంటెంట్పై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ ద్వారా రూపొందించిన ప్రతీ ఫోటో, వీడియోపై స్పష్టమైన లేబులింగ్ ఉండాలని, వీక్షించే కంటెంట్ అసలైనదో కాదో తెలుసుకునే హక్కు వినియోగదారులకు ఉందని స్పష్టం చేసింది. ఫ్లాగ్ చేసిన హానికరమైన కంటెంట్ మళ్లీ ప్రత్యక్షం కాకుండా లేదా ప్రచారంలోకి రాకుండా అల్గారిథమ్ safeguards అమలు చేయాలని డిమాండ్ చేసింది. మెటా అల్గారిథమ్లను పూర్తిగా మార్చాలని తాము కోరడం లేదని, కానీ భారత చట్టాలకు కట్టుబడి వ్యవహరించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande