
మణిపూర్, 18 ఆగస్టు (హి.స.)
నిత్యం అల్లర్లు, హింసలతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉండే ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో శాంతిభద్రతల పునరుద్ధరణ దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ 'కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ' (KCP-Taibangngaba/PWG) విభాగానికి చెందిన 46 మంది సాయుధ కేడర్లు మంగళవారం హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో చేరారు. ఇంఫాల్లో నిర్వహించిన అధికారిక 'హోమ్కమింగ్' కార్యక్రమంలో వీరు ముఖ్యమంత్రి వై. ఖేమ్చంద్ సింగ్ సమక్షంలో తమ ఆయుధాలను వదిలి లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మహిళా కేడర్లు కూడా ఉండగా.. వారు ఏకే-సిరీస్ తుపాకులు, ఇన్సాస్, కార్బైన్లు, పిస్టల్స్ తో పాటు రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG) లాంచర్లు, భారీగా మందుగుండు సామగ్రిని భద్రతా దళాలకు అప్పగించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఖేమ్చంద్ సింగ్ మాట్లాడుతూ.. బులెట్లతో కాకుండా చర్చలు, శాంతియుత సహజీవనం ద్వారానే మణిపూర్ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. లొంగిపోయిన కేడర్లకు ప్రభుత్వ పునరావాస పథకం (Surrender-cum-Rehabilitation Scheme) కింద ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ అందించి సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర సాయుధ గ్రూపుల సభ్యులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతి లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..