
హైదరాబాద్, 18 ఆగస్టు (హి.స.)
జూలై 20న చలో సంసద్ కార్యక్రమం నేపథ్యంలో జంతర్ మంతర్ వద్ద ఆందోళనల సందర్భంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS), బయోమెట్రిక్ సాంకేతికతను ఉపయోగించడాన్ని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో సమర్థించుకున్నారు. ప్రశాంతంగా నిరసన తెలిపే సాధారణ పౌరులు లేదా విద్యార్థులపై ఎటువంటి సామూహిక నిఘా పెట్టలేదని కేవలం పాత నేరచరిత్ర ఉన్న వారిని గుర్తించడానికే ఈ వ్యవస్థను ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు.
ఫేస్ కెమెరాల ద్వారా పాత నేరచరిత్ర కలిగిన 2,873 మందిని గుర్తించామని పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరిలో 92 మందిపై 10 కంటే ఎక్కువ నేర కేసులు ఉండగా, మరో 47 మంది రౌడీషీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. హత్య, అత్యాచారం, పోక్సో (POCSO), దోపిడీ వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న 2,873 మందిపైనే సిట్ విచారణ జరుపుతుందని, మిగతా సాధారణ నిరసనకారులపై ఎలాంటి కేసూ ఉండదని వెల్లడించారు.
సీజేపీ మార్చ్ సందర్భంగా కొందరు అల్లరిమూకలు పోలీసు సిబ్బందిని రాళ్లు, కర్రలతో తీవ్రంగా కొట్టారని, ఈ దాడుల్లో 240 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని వివరించారు. నిరసనల్లో పాల్గొన్న మహిళల భద్రత కోసం 4,600 మందికి పైగా మహిళా పోలీస్ సిబ్బందిని విధుల్లోకి దించినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు