
భద్రాద్రి కొత్తగూడెం, 19 ఆగస్టు (హి.స.)
టేకులపల్లి మండలంలో పోలీసులు
9.520 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు టేకులపల్లి ఎస్సై కే.తిరుపతి తన సిబ్బందితో కలిసి మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో వెంకట్య తండాలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన స్కూటీని తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు తెలిపిన వివరాల ప్రకారం .. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.4.76 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన స్కూటీ (OD 30 G 8039)తో పాటు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఏ1 నిందితుడు టపాన్ మండల్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఏ2, ఏ3 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ దాడిలో ఎస్సై కే.తిరుపతితో పాటు కానిస్టేబుళ్లు బి.సురేష్, టీ.చక్రధర్రాజు, బి.భాస్కర్, ఎం.ప్రవీణ్, బి.అనంతరాములు పాల్గొన్నారు. గంజాయి పట్టివేతలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఇల్లందు డీఎస్పీ యు.వెంకన్నబాబు అభినందించి రివార్డు అందజేశారు. కేసు దర్యాప్తులో భాగంగా టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ ఏ1 నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు