ఆక్రమణలపై క్షేత్రస్థాయి విచారణకు మంత్రి పొంగులేటి ఆదేశం
ఆక్రమణలపై క్షేత్రస్థాయి విచారణకు మంత్రి పొంగులేటి ఆదేశం
Minister


ఖమ్మం, 19 ఆగస్టు (హి.స.)

పల్లెగూడెంలోని ప్రభుత్వ, అసైన్డ్

భూములను అక్రమంగా ఆక్రమించిన వారి నుంచి వెంటనే స్వాధీనం చేసుకుని, గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణలను గుర్తించి వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి అర్హుడికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసమే భూములను సమీకరించి ఇళ్ల స్థలాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

రూ.61.76 కోట్లతో ప్రగతి పరుగులు...

పల్లెగూడెం సమగ్ర వికాసానికి రూ.61.76 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. గ్రామంలో ఇప్పటికే రూ.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, గొల్లగూడెం నుంచి పల్లెగూడెం వరకు ఎన్ఎస్పీ కాల్వ గట్టుపై రూ.5.80 కోట్లతో మోడల్ సీసీ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా, పల్లెగూడెం నుంచి మంగళగూడెం వరకు రూ.55 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రూ.20 లక్షల వ్యయంతో పంచాయతీ కారా కార్యాలయ భవనాన్ని కేవలం రెండు నెలల వ్యవధిలోనే నాణ్యతతో పూర్తి చేయడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అభినందించారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రూ.12 లక్షలతో నూతన అంగన్వాడీ భవనాన్ని కూడా తక్షణమే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande