
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)
తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం, విద్యా రంగంలో అంతర్జాతీయ భాగస్వామ్యాలు కుదుర్చుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి (ఆగస్టు 20) ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే), అమెరికాలో 10 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 30న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఈరోజు (ఆగస్టు 19) ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొననున్న సీఎం, సమావేశం ముగిశాక రాత్రికి ఢిల్లీ నుంచే నేరుగా లండన్‌కు బయలుదేరనున్నారు. ఆగస్టు 20న లండన్‌లో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ కుమార్తె వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరవుతారు.
పర్యటనలో భాగంగా తొలుత యూకేలో ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమవుతారు. బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్‌ను సందర్శించడంతో పాటు, ఎమిరేట్స్ స్టేడియంలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ ప్రెజెంటేషన్‌కు హాజరవుతారు. అనంతరం ఆగస్టు 23న అమెరికాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ బోస్టన్‌లోని హార్వర్డ్, ఎంఐటీ క్యాంపస్‌లను సందర్శిస్తారు. నార్త్‌ఈస్టర్న్, వర్జీనియా టెక్ యూనివర్సిటీల ప్రతినిధులతోనూ భేటీ అవుతారు. న్యూయార్క్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ పర్యటనలో అత్యంత కీలకమైన భాగంగా ఆగస్టు 27, 28 తేదీల్లో గ్లోబల్ సీఈవోలు, వెంచర్ క్యాపిటలిస్టులు, బహుళజాతి సంస్థల అధిపతులతో పారిశ్రామిక రౌండ్‌టేబుల్ సమావేశాలు జరగనున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం దృష్టి సారిస్తారు. వాస్తవానికి ఈ పర్యటనలో చైనా, జర్మనీలను కూడా చేర్చాలని భావించినప్పటికీ, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో దానిని యూకే, అమెరికాకే పరిమితం చేశారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi