
హైదరాబాద్, 19 ఆగస్టు (హి.స.)
హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోని ఫతే దర్వాజా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడి ఒక మూడంతస్తుల భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో అటు అధికారులు, ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫతే దర్వాజాలో ఉన్న ఈ భవనంలోని మూడో అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు కింది అంతస్తులకు, పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా సకాలంలో చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ఘటనలో భారీగానే ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం ప్రమాద కారణాలతో పాటు ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలపై స్పష్టత వస్తుందని అధికారులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi