
విశాఖపట్నం, 19 ఆగస్టు (హి.స.)
విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లపై కొందరు ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టిస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. డేటా సెంటర్లకు అవసరమైన నీరు, విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ఉందని, దీనివల్ల ప్రజలకు గానీ, సాగునీటికి గానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని అసెంబ్లీ వేదికగా ఆయన హామీ ఇచ్చారు. నేడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సుదీర్ఘంగా సమాధానమిచ్చారు.
నీటి భద్రతపై పూర్తి స్పష్టత
డేటా సెంటర్లకు నీటి కేటాయింపులపై వస్తున్న ఆందోళనలు అనవసరమని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. గోదావరి నుంచి ఏటా సగటున 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. విశాఖలో 6.5 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేసినా, వాటికి అవసరమయ్యేది కేవలం 3 టీఎంసీల నీరే. పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా విశాఖకు తరలిస్తున్న నీటిని తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు కేటాయించాం. ఈ పారిశ్రామిక వాటా నుంచే డేటా సెంటర్లకు నీరు అందిస్తాం. నగర ప్రజల తాగునీటి వ్యవస్థ నుంచి ఒక్క చుక్క కూడా మళ్లించం. పైగా, ఇప్పుడు ఎయిర్ కూలింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి రావడంతో నీటి వినియోగం గణనీయంగా తగ్గుతోంది అని వివరించారు. రాబోయే 18 నెలల్లో పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా విశాఖకు తాగునీరు అందిస్తామని, డేటా సెంటర్ల కోసం ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదు
విద్యుత్ సరఫరా, ఛార్జీల విషయంలోనూ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉందని లోకేశ్ అన్నారు. ఒక గిగావాట్ థర్మల్ ప్లాంట్‌కు, డేటా సెంటర్‌కు వినియోగించే నీటి కన్నా పది రెట్లు ఎక్కువ అవసరమని, కానీ దాని గురించి ఎవరూ మాట్లాడరని ఆయన చురక అంటించారు. డేటా సెంటర్లు తప్పనిసరిగా 70% గ్రీన్ ఎనర్జీనే వాడాలని స్పష్టమైన నిబంధన పెట్టాం. సౌర, పవన విద్యుత్‌ను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నాం. ప్రధాని మోదీ తెచ్చిన 'వన్ నేషన్-వన్ గ్రిడ్' విధానంతో రాయలసీమలో ఉత్పత్తి అయ్యే పునరుత్పాదక శక్తిని దేశంలో ఎక్కడికైనా పంపవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. పైగా ఈ ఏడాది 13 పైసలు తగ్గించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది అని లోకేశ్ గుర్తుచేశారు.
'విశాఖపట్నం' ఇక 'ఏఐ పట్నం'
డేటా సెంటర్ల రాకతో విశాఖ స్వరూపమే మారిపోతుందని, ఇది కేవలం కొన్ని ఉద్యోగాలకే పరిమితం కాదని మంత్రి తెలిపారు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థ విశాఖకు వస్తుండటంతో దాని చుట్టూ బలమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థ (ఎకో సిస్టమ్) ఏర్పడుతుంది. కూలింగ్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఫైబర్ తయారీ వంటి అనుబంధ పరిశ్రమలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా రాయలసీమకు వస్తున్నాయి. ఒక్క కూలింగ్ ఎకోసిస్టమ్ వల్లే రాయలసీమలో 20,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని ఆయన పేర్కొన్నారు. కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్ చెప్పినట్లుగా, విశాఖపట్నం ఇక 'ఏఐ పట్నం'గా మారబోతోందని, ఏఐకి సంబంధించిన కోర్సులతో ఒక అమెరికన్ విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు కానుందని వెల్లడించారు.
1995లో కంప్యూటర్లపై ఇలాంటి దుష్ప్రచారమే చేశారని, అప్పుడు ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉంటే హైదరాబాద్ నేటి ఐటీ హబ్‌గా ఎదిగేది కాదని లోకేశ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు పర్యావరణంపై కొంత భారం ఉంటుందని, కానీ దాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi