
హైదరాబాద్, 02 ఆగస్టు (హి.స.) ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతిస్తోంది. భద్రాచలం వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఆదివారం ఉదయం 10 గంటలకు 46.7 అడుగుల వద్దకు గోదావరి నీటి మట్టం చేరుకుంది. 10.83లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వెళుతోంది. ప్రవాహం తగ్గడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది. సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
భద్రాచలంతో పాటు దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు మండలాల్లో రహదారుల పైకి చేరిన వరద నీరు తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆయా రహదారుల్లో రాకపోకలు కొనసాగుతున్నాయి. మరోవైపు బూర్గంపాడు మండలంలోని సారపాక, మోతే గ్రామాల్లో ఇళ్ల వరకు చేరిన వరద నీరు తగ్గు ముఖం పట్టింది. దీంతో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వరద బాధితులు ఇళ్లకు చేరుకుంటున్నారు. వరద ప్రవాహం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి తగ్గి ప్రవహిస్తున్నప్పటికీ స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరదనీటిలోనే ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్