
న్యూఢిల్లీ, 21 ఆగస్టు (హి.స.)
ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది.
దేశరాజధానిలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా స్వైన్ ఫ్లూతో పాటు ఇతర శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. వైరస్ బారినపడిన రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లలోనూ స్వైన్ ప్లూ లక్షణాలు కనిపిస్తుండటం ఆందోళనకరంగా మారింది. కొంతమంది రోగులు తీవ్రమైన లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఆరు రెట్లు కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే కాలంలో 229 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఢిల్లీలో ఇప్పటి వరకు 1,349 కేసులు నమోదయ్యాయని చెబుతున్నారు.
చాలా మందిలో ఆక్సీజన్ స్థాయిలో పడిపోవడంతో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. సాధారణంగా స్వైన్ ఫ్లూ వచ్చినవారిలో జ్వరంతో పాటు పొడిదగ్గు, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, తలనొప్పి, చలి, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు రోగులలో శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు, ఆక్సీజన్ పడిపోవడం లాంటి తీవ్రమైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. అదే విధంగా ఆయాసం, ఛాతినొప్పి, పెదవులు నీలిరంగులోకి మారడం లాంటి లక్షణాలు సైతం ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..