
హైదరాబాద్, 22 ఆగస్టు (హి.స.)
చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలుబు, దగ్గు, అలర్జీల నివారణకు సాధారణంగా వాడే క్లోర్ఫెనిరమైన్ మలేట్ (Chlorpheniramine Maleate),ఫెని లెఫ్రిన్, హైడ్రోక్లోరైడ్ (Phenylephrine Hydrochloride) కాంబినేషన్ ఔషధాల వినియోగంపై పరిమితులు విధించింది. నాలుగేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్నారులకు ఈ కాంబినేషన్తో కూడిన ఔషదం వినియోగించరాదని స్పష్టం చేసింది.
డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, నిపుణుల కమిటీ చేసిన హెచ్చరికల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఈ కాంబినేషన్ మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు తమ ఔషధాల లేబుళ్లు, ప్యాకేజింగ్, ప్రచార సామగ్రిపై “ఈ మందును 4 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉపయోగించరాదు” అని స్పష్టమైన హెచ్చరికను ముద్రించాలని ఆదేశించింది. కాగా ఈ ఏడాది జూన్లోనూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా మానవ వినియోగానికి సంబంధించిన 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీని నిషేధించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు