
ముంబై, 24 ఆగస్టు (హి.స.)
వరుసగా రెండు వారాలపాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్ల (Stock Markets) కు సోమవారం జోష్ వచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలు 2 శాతం వరకు తగ్గడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇవాళ ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పుడు, బీఎస్ఈ సెన్సెక్స్ (BSE Sensex) 88 పాయింట్ల లాభంతో 77,629 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) 33 పాయింట్లో లాభంతో 24,285 వద్ద ట్రేడయ్యాయి.
సోమవారం నాటి ట్రేడింగ్లో రంగాల వారీగా చూస్తే మెటల్ షేర్లలో కొనుగోళ్ల సందడి కనిపించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 1 శాతం లాభపడింది. అదేవిధంగా నిఫ్టీ మీడియా, ఆయిల్, గ్యాస్, ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే నిఫ్టీ హెల్త్కేర్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాల సూచీలు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
విశ్లేషకుల అంచనా ప్రకారం.. సమీప భవిష్యత్తులో నిఫ్టీ 24,200 నుంచి 24,600 పాయింట్ల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడవచ్చు. దేశీయ ఆర్థికవ్యవస్థ బలంగా ఉండటం, కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండటం మార్కెట్కు మద్దతు ఇస్తున్నప్పటికీ, అధిక ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు లాభాలకు అడ్డుకట్ట వేయవచ్చని వారు భావిస్తున్నారు. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 93 డాలర్ల వద్ద ఉండటం, పశ్చిమాసియా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు మార్కెట్పై ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..