ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం.. సూర్యాపేట జిల్లా ఎస్పీ
ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం.. సూర్యాపేట జిల్లా ఎస్పీ
Sp


సూర్యాపేట, 27 ఆగస్టు (హి.స.)

నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.

పోలీస్టేషన్లు, కార్యాలయాల వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కోదాడ డివిజన్ డీఎస్పీ కార్యాలయం, పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ట్రాఫిక్ పోలీస్టేషన్లో డ్రంకన్ డ్రైవ్, ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్లను పరిశీలించిన ఎస్పీ.. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనర్ డ్రైవింగ్, యువత డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఆకస్మిక తనిఖీలు, స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మరింత పటిష్టం చేయడంతోపాటు అక్రమ పార్కింగు అరికట్టాలని తెలిపారు. రహదారిపై వాహనాలు బ్రేక్ డౌన్ అయితే వెంటనే డయల్ 112కు సమాచారం ఇచ్చి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వాహనదారులకు సూచించారు.

హైవేపై నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, రహదారి భద్రతపై సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.డీఎస్పీ కార్యాలయంలో వివిధ రికార్డులను పరిశీలించిన ఎస్పీ.. వరకట్న హత్యలు, ఆత్మహత్యలు, తీవ్రమైన చీటింగ్, అట్రాసిటీ, మైనర్లపై వేధింపుల కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. డివిజన్లోని అన్ని పోలీస్టేషన్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించి, సిబ్బంది పనితీరును మెరుగుపర్చాలని డీఎస్పీ శ్రీనివాన్రెడ్డికి సూచించారు.మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సామాజిక అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. రహదారుల వెంట ఉన్న గ్రామాలు, హోటళ్లు, టీ దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నిర్వాహకులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నిఘా పెంచాలని ఆదేశించారు. సైబర్ మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ తెలిపారు.

మునగాల, నడిగూడెం, చిలుకూరు మండలాల్లో యువతకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించామని, ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టడంతో సైబర్ నేరాలను నియంత్రించగలిగామని పేర్కొన్నారు. తనిఖీల సందర్భంగా పోలీసు సిబ్బంది కవాతును పరిశీలించిన ఎస్పీ, కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ స్మార్ట్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande