మరో 230 మెగావాట్ల పెరగనున్న రాష్ట్ర జలవిద్యుత్ సామర్థ్యం
మరో 230 మెగావాట్ల పెరగనున్న రాష్ట్ర జలవిద్యుత్ సామర్థ్యం
మరో 230 మెగావాట్ల పెరగనున్న రాష్ట్ర జలవిద్యుత్ సామర్థ్యం


అమరావతి, 30 ఆగస్టు (హి.స.)

:రాష్ట్ర జలవిద్యుత్తు సామర్థ్యం మరో 230 మెగావాట్లు పెరగనుంది. సీలేరు కాంప్లెక్స్లో భాగమైన పొల్లూరు (లోయర్ సీలేరు) జల విద్యుత్తు ప్రాజెక్టు ప్రస్తుత సామర్థ్యం 460 మెగావాట్ల (115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు)కు అదనంగా మరో రెండు యూనిట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఒక్కోటి 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ రెండు యూనిట్లు ఈ ఏడాది అక్టోబరు నాటికి అందుబాటులోకి రానున్నట్లు ఏపీ జెన్కో అధికారులు తెలిపారు. ఈ కొత్త యూనిట్లతో లోయర్ సీలేరు జల విద్యుత్తు ప్రాజెక్టు సామర్థ్యం 690 మెగావాట్లకు చేరుతుంది. శ్రీశైలం తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద జల విద్యుత్తు ప్రాజెక్టుగా అవతరిస్తుంది. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్తు ప్రాజెక్టులు సుమారు 1200 మెగావాట్లు (ఏపీవాటా) సామర్థ్యంతో ఉన్నాయి. శ్రీశైలం కుడిగట్టుపై ఉన్న జలవిద్యుత్తు ప్రాజెక్టు 770 మెగావాట్ల సామర్థ్యంతో రాష్ట్రంలో అతిపెద్ద జల విద్యుత్తు ప్రాజెక్టు. ఇక పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు పూర్తయితే 960 మెగావాట్ల సామర్థ్యంతో ఆ ప్రాజెక్టు రాష్ట్రంలో అతిపెద్ద జల విద్యుత్తు ప్రాజెక్టుగా నిలుస్తుంది. పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టులో ఈ ఏడాది చివరికి ట్రయల్ రన్ వేసేందుకు జెన్కో అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి జరగాలంటే పోలవరం ప్రాజెక్టు నీటి మట్టం కనీసం 41.5 అడుగులు ఉండాలి. ప్రస్తుతం ఆ స్థాయిలో ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే పరిస్థితులు లేనందున ట్రయల్ రన్ మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande