
ఆసిఫాబాద్, 05 ఆగస్టు (హి.స.)
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు
వస్తాయనే ఆశను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారని, డిజిటల్ ప్రపంచంలో అప్రమత్తతే శ్రీరామరక్ష అని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. బుధవారం కాగజ్ నగర్ లోని హెచ్ఎర్లీ భవనంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ జాగ్రత్త దివాస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణలో రోజుకు దాదాపు ₹5 కోట్లు, దేశవ్యాప్తంగా ₹70 కోట్ల మేర ప్రజలు సైబర్ మోసాల వల్ల నష్టపోతున్నారని తెలిపారు. అపరిచితులు పంపే ఏపికే ఫైళ్లు, అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. అనంతరం సైబర్ భద్రతా పోస్టర్లను ఆవిష్కరించి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటారని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..